Loading...

16, ఫిబ్రవరి 2013, శనివారం

మయూరుని సూర్యశతకము , అర్థము


      మయూరుడు వ్రాసిన శతకము సూర్యభగవానుని స్తుతిస్తూ వ్రాసిన శతకము. ఈ శతకము ఎంతో ప్రసిద్ధిపొందినది. గంభీరమైన పదబంధాలతో, అచ్చెరువుకు గురిచేసే భావజాలంతో, అద్భుతమైన శబ్ద, అర్థాలంకారాలతో శోభించే ఈ శతకమును పలికి తన కుష్ఠురోగమునుంచి మయూరుడు విముక్తుడైనాడని ప్రచలితమైన కథ. విదేశీ భాషల్లోనికి కూడా అనువదించబడియున్నది.

           శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులవారు వివరించిన అర్థముతో భువనవిజయం ప్రచురణ సంస్థ వారు ప్రచురించిన పుస్తకం లో ఉన్న సమాచారమే ఇదంతా. గూగులించినపుడు పెద్ద వివరాలు దొరకలేదు. (ఈ మాట వారు సూర్యశతకాన్ని ఇచ్చియున్నారు కాని అందులో అర్థములు తెలుపలేదు.) ఇంత కష్టమైన సంస్కృతము అర్థముకాని నాలాంటి సాహిత్యాభిమానుల కోసం ఈ పుస్తకములో నున్న అర్థాన్ని యథాతథంగా ప్రచురిస్తున్నాను.

    రథసప్తమి సందర్భంగా జగత్తు పుట్టుకకు, పోషణకు, లయమునకు భౌతికంగా కనిపిస్తూ కారకుడైన సూర్యభగవానునికి శ్రద్ధాపూర్వక నమస్కారములు.

౧. జమ్భారాతీభకుమ్భోద్భవమివ దధతస్సాంద్ర సిన్దూరరేణుం
రక్తాస్సిక్తా ఇవౌఘైరుదయగిరితటీ ధాతుధారా ద్రవస్య
ఆయాన్త్యా తుల్యకాలం కమలవనరుచే వారుణావో విభూత్యై
భూయా సుర్భాసయన్తో భువనమఖినవా భానవో భానవీయాః ||
అర్థము
జమ్భారాతీభ కుమ్భోద్భవం = ఐరావతము యొక్క కుంభస్థలమందు బుట్టిన (ఉండిన), సాన్ద్ర సిన్దూరరేణుం= దట్టమగు సిందూరపు పొడిని, దధత యివ=ధరించినట్టున్నవియు, ఉదయగిరి తటీ ధాతుధారాద్రవస్య= ఉదయపర్వతపు చరియల యందలి గైరికాది ధాతువుల ధారాజలము యొక్క, ఓఘై:= ప్రవాహములచేత, సిక్తాః = తడిసినవియు (అందుచేతనే) , రక్తాః= ఎర్రగానున్నవియు, తుల్యకాలం= అదే సమయమందు, ఆయాన్త్యాః = వచ్చుచున్న, కమలవనరుచా యివ= పద్మవనముల కాంతి చేతనో అనునట్లు, అరుణాః= ఎర్రనివియు, భువనం = లోకము(ల)ను, భాసయన్తః= ప్రకాశింపజేయునవియు అయిన, భానవీయాః=సూర్యుని సంబంధమయిన, అభినవాః=క్రొత్త , భానవః=కిరణములు, వః=మీయొక్క, విభూత్యై= సంపద కొఱకు, భూయాసుః =సమర్థములగుగాక.
పైనున్న అర్థాలను కలిపి భావము నేను ఇక్కడ వ్రాస్తున్నాను. తప్పులుంటే పెద్దలు సరిదిద్దగలరు.
భావము=ఐరావతము యొక్క కుంభస్థలమందు బుట్టిన దట్టమగు సిందూరపు పొడిని ధరించినట్టు ఉదయపర్వతపు చరియల యందలి గైరికాది ధాతువుల ప్రవాహములచేతడిసినట్టు ఎర్రగానున్నపద్మవనముల కాంతి చేతనో ఎర్రనైనట్టు లోకాలను ప్రకాశింపజేసే సూర్యుని నవకిరణాలు మీ మీ సంపదలను వృద్ధి జేయుగాక.

౨. భక్తిప్రహ్వాయ దాతుం ముకుళపుట కుటీ కోటర క్రోడలీనాం
లక్ష్మీమాక్రష్టుకామా ఇవ కమల పనోద్ధాటనం కుర్వతేయే,
కాలాకారాన్ధకారా ననపతిత జగత్సాధ్వనధ్వంసకల్యాః
కల్యాణం వః క్రియాసుః కిసలయరుచయస్తే కరా భాస్కరస్య||
అర్థము
ముకుళపుటీ కుటీ కోటర క్రోడలీనాం= (సూర్యోదయమునకు ముందు ) ముకుళించియున్న పద్మపుటములనెడి కోటరములలో దాగియున్న, లక్ష్మీ= లక్ష్మిని, భక్తి ప్రహ్వాయ= భక్తి చేత వంగిన వానికి (భక్తునకు), దాతుం = ఇచ్చుటకు, ఆక్రష్టుకామా ఇవ= ఆకర్షింపగోరినవో అనునట్లు, యే=యేవి, కమలవనోద్ఘాటనం కుర్వతే= పద్మవనములను ఖేదించుచున్నవో మరియు, కాలకాలాన్ధకారాననపతిత జగత్సాధ్వసధ్వంసకల్యాః= కాలుని వంటి ఆకారము గల అంధకారము నోటబడిన జగత్తుయొక్క భయమును పోగొట్టుటయందు సమర్థములయినవో, తే= అట్టి, కిసలయరుచయః= చిగురుటాకు వలె ఎర్రని కాంతిగల, భాస్కరస్య కరా= సూర్యుని కిరణములు, వః = మీకు, కల్యాణం శుభమును,క్రియాసుః= జేయుగాక.
ఈ శ్లోకమున అంధకారమునకు విశేషణమగు కాలాకార శబ్దమునకు యముని ఆకారముగల,నల్లని ఆకారముగల , కాలమే ఆకారమయిన అని మూడు అర్థములు చెప్పవచ్చు.
భావము (నాకు తెలిసి)
పద్మమునందలి లోపలి కక్ష్యలలో విశ్రమించిన లక్ష్మి అనుగ్రహము భక్తులకు కలుగుటకు వీలుగా పద్మమును వికసింపజేయునట్టి, కాలుని లా నల్లని చీకటి కమ్ముకున్నపుడు జగత్తు భయమును పోగొట్టుటకై సామర్థ్యముతోనున్నట్టి, చిగురుటాకుల్లా ఎర్రని సూర్యకిరణములు మీకు శుభమును కలిగించుగాక.

౩.గర్భేష్వమ్భోరుహాణాం శిఖరిషు చ శితాగ్రేషు తుల్యం పతన్తః
ప్రారమ్భే వాసరస్య వ్యుపరతిసమయే చైకరూపాస్తథైవ
నిష్పర్యాయం ప్రవృత్తా స్త్రిభువనభవన ప్రాఙ్గణే పాన్తు యుష్మా
నూష్మాణం సన్తతాధ్వశ్రమజమివ భృశం బిభ్రతో బ్రధ్నపాదాః||
అమ్భోరుహాణాం గర్భేషు = (మెత్తని) పద్మములలోపలను, శితాగ్రేషు= వాడి శృంగముగల, శిఖరిషుచ= పర్వతముల యందును, తుల్యం=సమానముగా, పతన్తః = ప్రసరించుచున్నవియు, వాసరస్య ప్రారంభే= పగటియొక్క మొదటికాలమందు( ఉదయకాలమున) , ఉపరతిసమయే చ= అస్తమయ సమయమందున, ఏకరూపాః= ఒకటే రూపము కలవియు (ఎర్రనివి అని), తథైవ = అట్లే, త్రిభువన ప్రాంగణేషు= మూడులోకములనెడి ముంగిళ్ళయందు,  నిష్పర్యాయం = వేరు వేరు సమయములలో కాక ఒక్క సమయముననే, ప్రవృత్తాః= ప్రసరించుచున్నవియు మరియు, సంతతాధ్వశ్రమజం ఇవ = యెప్పుడును ఆకాశమార్గమున చరించునని కలిగినదో అనునట్లున్న, ఊష్మాణం= వేడిని, బిభ్రతో= భరించినవియునగు, బ్రధ్నపాదాః= సూర్యకిరణములు, యుష్మాన్= మిమ్ము, పాంతు = రక్షించుగాక, పాదశబ్దము కిరణము కూడా అని అర్థము.
కవి ఈ శ్లోకమున పాదశబ్దము ప్రయోగించి సూర్యసంచారమును నిర్వహించినాడు
 భావము (నాకు తెలిసి)
గిరిశిఖరాల ఎత్తులపైనా, పద్మాల లోతుల్లోనా సమానంగా ప్రసరించేవి, ఉదయాస్తమయ సమయల్లో ఒకే ఎఱ్ఱని రంగు కలవి, మూడు లోకాలనే ముంగిళ్ళలోఒకే సమయంలో ప్రసరించేవి, ఆకాశంలో పయనిస్తూ వేడిగా ఉండేవి అయిన సూర్యకిరణాలు మిమ్ము రక్షించు గాక.

౪.ప్రభ్రశ్యత్యుత్తరీయత్విషి తమసి సముద్వీక్ష్య వీతావృతీన్ప్రా
గ్జన్తూం స్తన్తూన్యథా యానతను వితనుతే తిగ్మరోచిర్మరీచీన్
తే సాన్ద్రీభూయసద్యః క్రమవిశదదశాశాదశాళీ విశాలం
శశ్వత్సంపాదయన్తోమ్బరమమలమలం మఙ్గళం వోదిశన్తు||
అర్థము
ఉత్తరీయత్విషి= (నల్లని) ఉత్తరీయమువంటి, తమసి= అంధకారము, ప్రభ్రశ్యతి= జారిపోగా, ప్రాక్ = ముందు, వీతావృతీన్= ఆవరణము(కట్టువస్త్రము) పోయిన, జంతూన్ = ప్రాణులను, సముద్వీక్ష్య= చూచి, తగ్మరోచిః=సూర్యుడు, యాన్ మరీచిన్= ఏ కిరణములను, తన్తూన్ యథా=దారములవలె , వితనుతో=చేయుచున్నాడో, తే= ఆ కిరణములు, సద్యః=తత్కణమందు,సాంద్రీభయ=దట్టములై, అంబరం = ఆకాశమును (వస్త్రమును అనియును) ,క్రమవిశదదశాశాదశాళీ విశాలం=క్రమముగా తెల్లవారిన దశదిశలనెడి అంచుల చేత విశాలమయినదిగాను, అమలం= నిర్మలమయినదిగాను(రజస్సులేనిదిగా), సంపాదయంతః= చేయుచున్నవై, వః= మీకు, అలం= చాలినంత, మంగళం= శుభమైన , శశ్వత్=శాశ్వతముగా, దిశన్తు= ఇచ్చుగాక.
" సదశం నూతనం దృఢం" " అరజేవాససీ" అనినట్లు వస్త్రమునకు అంచులుండుట, రజస్సు (దుమ్ము) లేకుండుట ప్రశస్తము. కవి ఆకాశపర్యాయముగా అంబర శబ్దమును వాడి విశేషణముల ద్వారా సవిశేషమగు ఉత్ప్రేక్షను సాధించినాడు
భావము (నాకు తెలిసి)
జారిపోయిన ఉత్తరీయము వలె అంధకారము తొలగుతుండగా, దశదిశలనెడు (ధూళి చేరని, మాయని) అంచులు గల కిరణదారములతో దట్టముగా అల్లిన గగనాంబరాన్ని శుభప్రదంగా చాలినంత యిచ్చుగాక.

౫.న్యక్కుర్వన్నోషధీశే ముషితరుచి శుచేవౌషధీః ప్రోషితాభా
భాస్వద్గ్రావోద్గతేన ప్రథమమివ క్రుతాభ్యుద్గతిః పావకేన
పక్షచ్ఛేదవ్రణాసృక్సృత ఇవ దృషదో దర్శయన్ప్రాతరద్రే
రాత్రామ్రస్తీవ్రభానోరనభిమతనుదే స్తాద్గభస్త్యుద్గమో వః||
అర్థము
ఓషధీశే=చంద్రుడు, ముషితరుచి= కాంతిహీనుడు కాగా (సూర్యోదయముచేత చంద్రుని కాంతి హీనమగును) , శుచా ఇవ= ఆ శోకము చేతనో అనునట్లు, ప్రోషితాభాః= కాంతివిహీనములయిన, ఓషధిః = ఓషధులను, న్యక్కుర్వన్=తిరస్కరించుచున్నదియు, భాస్వద్గ్రావోద్గతేన= సూర్యకాంత మణులనుండి వెడలిన, పావకేన= అగ్నిచేత, ప్రథమం=ముందుగా, కృతాభ్యుద్గతిఃఇవ= స్వాగతమీయబడినట్లున్నదియు, పక్షచ్ఛేద వ్రణాసృక్సృతః ఇవ= (ఇంద్రుడు) ఱెక్కలు నరుకుటవలన కలిగిన పుండ్లనుండి రక్తము కారుచున్నచో అనునట్లున్న, ప్రాతర ద్రేఃదృషదః= ఉదయాద్రి యొక్క రాళ్ళను, దర్శయన్= చూపుచున్న, ఆతామ్రః= అంతటను ఎర్రనగు, తీవ్రభానోః గభస్త్యుద్గమః= సూర్యునియొక్క కిరణోదయము, వః= మీకు, అనభిమతనుదే = అనిష్టములను పోగొట్టుటకు, స్తాత్= (సమర్థము) అగుగాక.
భావము (నాకు తెలిసి)
(ఉదయాద్రి గురించి)తనపై నున్న చంద్రుడు సూర్యోదయముతో కాంతిహీనుడు కాగా శోకముతో నున్నట్టి, ఓషధులను తిరస్కరించినట్టి, సూర్యకాంతమణుల అగ్నిశిఖలతో స్వాగతంపొందినట్టి, ఱెక్కలు ఇంద్రుడు కత్తిరించగా కారిన రక్తముతోనున్నట్టు కనుపించే ఉదయాద్రి పైనున్న సూర్యకిరణములు మీకు అనిష్టములను పోగొట్టుగాక.

 ౬.శీర్ణఘ్రాణాఙ్ఘ్రిపాణీన్వ్రణిభిరవఘనైర్ఘర్ఘరావ్యక్తఘోషా
న్దీర్ఘాఘ్రాతానఘౌఘైః పునరపి ఘటయత్యేక ఉల్లాఘయన్యః
ఘర్మాంశోస్తస్య వోన్తర్ద్విగుణఘన ఘృణానిఘ్ననిర్విఘ్నవృత్తే
ర్దత్తార్ఘాస్సిద్ధసఙ్ఘైర్విదధతుఘృణయశ్శీఘ్రమంహోవిఘాతం

అర్థము
అఘౌఘైః = పాప సమూహములచేత, దీర్ఘాఘ్రాతాన్= చిరకాలము ఆఘ్రాణింపబడినవారిని (అనగా పాపములు చేసినవారిని అని) అందుచేతనే, వ్రణిభిః= పుండ్లు కలిగిన, అవఘనైః= అవయవములతో, ఘర్ఘరావ్యక్తఘోషాన్=శిథిలమై స్ఫుటముకాని కంఠధ్వని కలవారిని, ఉల్లాఘయన్=రోగములేని వారినిగాచేయుచు, యః = ఎవడు, శీర్ణఘ్రాణాంఘ్రిపాణిన్= శిథిలమయిపోయిన ముక్కు కాళ్ళు చేతులును, ఏకః= ఒక్కడే , పునరపి=తిరిగి, ఘటయతి=ఘటింపజేయుచున్నాడో(అతుకుచున్నాడో), తస్య=అట్టి, అంతర్ద్విగుణఘన ఘృణానిఘ్న నిర్విఘ్నవృత్తే= దయాపరవశమయిన, నిరాటంకమయిన వృత్తి గల, ఘర్మాంశో= సూర్యునియొక్క, సిద్ధసంఘైః= సిద్ధులచేత, దత్తార్ఘా= పూజావిధులొసగబడిన ఘృణయః= కిరణములు, వః= మీకు, అంహోవిఘాతం= పాపనాశమును , విదధతు=చేయుగాక.
భావము(నాకు తెలిసి)
చిరకాలము పాపము చేయుచుండుట వలన రోగగ్రస్తులై, అవయవములు శిథిలమైన వారి రోగములను నివృత్తి చేసి, వారి దేహమునందలి అంగములను సరి చేయుటకై వారి పాపమును సూర్యుని యొక్క కిరణములు ధ్వంసముచేయుగాక.
౭.బిభ్రాణా వామనత్వం ప్రథమమథతథైవాంశవఃప్రాంశవోవః
క్రాన్తాకాశాన్తారాళాస్తధను దశదిశః పూరయన్త స్తతోపి
ధ్వాన్తాదాచ్ఛిద్య ద్వేవద్విష ఇవ బలినో విశ్వమాశ్వశ్నువానాః
కృచ్ఛ్రాణ్యుచ్ఛ్రాయహేలా వహసితహరయోహారిదశ్వాహరంతు||
అర్థము=
ప్రథమం=మొదట, వామనత్వం= వామనత్వమును(పొట్టిదనమును), బిభ్రాణాః= భరించినవియును, అథ= తరువాత, ప్రాంశవః= పొడవైనవియును , తథైవ=అట్లే, క్రాన్తాకాశాంతరాళాః= ఆకాశము నాక్రమించినవియును, తదను=తరువాత, దశదిశః=పదిదిక్కులను, పూరయన్తః= నింపినవియును(నిండినవి) ,తతోపి=తరువాత, దేవద్విషః= దేవతల శత్రువగు, బలినఃఇవ= బలిచక్రవర్తి నుండి పూర్వమాకర్షించినట్లు (గ్రహించినట్లు), ధ్వాన్తాత్=అంధకారమునుండి, విశ్వం=ప్రపంచమును, ఆచ్చిద్య= ఆకర్షించి (చీకట్లు తొలగించి అని అర్థము) ఆ ప్రపంచమును, ఆశువేశీఘ్రముగా, అశ్నువానాః= అనుభవించినవియును(వ్యాపించినవి అని భావము) ఉచ్చ్రాయహేలావహసితహరయః= తమఔన్నత్యముచేత, త్రివిక్రమావతారుడగు= విష్ణువు ను అపహసించిన, హారిదశ్వాః =సూర్యుని సంబంధములగు, అంశవః= కిరణములు, వః=మీయొక్క, కృచ్ఛ్రాణి= కష్టములను, హరన్తు= హరించుగాక.
భావము(నాకు తెలిసి)
బలి చక్రవర్తి నుంచి దానము స్వీకరించుటకై మొదట పొట్టివాడుగా ఉండి తరువాత త్రివిక్రముడైన విష్ణువులా సూర్యకిరణములు మొదట పొట్టిగా ఉండి తరువాత దశదిశలలో నిండి పోయి, చీకటినుండి ప్రపంచాన్ని గ్రహించినట్టు లాగుకొనుచు, మీ కష్టములను హరించుగాక.
౮.ఉద్గాఢేనారుణిమ్నా విదధతి బహుళం యే రుణస్యారుణత్వం
మూర్దోద్ధూతౌ ఖలీనక్షతరుధిరరుచో యే రథాశ్వాననేషు
శైలానాం శేఖరత్వం శ్రితశిఖరశిఖాస్తన్వతే యే దిశన్తు
ప్రేంఖంతః ఖే ఖరాంశోః ఖచితదినముఖాస్తే మయూఖాస్సుఖంవః||
అర్థము
యే=ఏవి, ఉద్గాఢేన= దట్టమయిన, అరుణిమ్నా= యెర్రదనముచేత, అరుణస్య= (సారథియైన)అనూరునియొక్క , అరుణత్వం=ఎఱ్ఱదనమును, బహుళం=విస్తారముగా, విదధతి= చేయుచున్నవో(మరియును), యే=ఏవి, మూర్ధోద్ధూతౌ=(తమ) తలలూపినప్పుడు , రథాశ్వాసనేషు= రథపు గుర్రముల ముఖములయందు,ఖలీనక్ష్తరుధిరరుచః= కళ్ళెపు రాపిడి వలన కలిగిన నెత్తుటివలె నున్నచో, యే= ఏవి, శ్రితశిఖరశిఖాః= శృంగాగ్రములను చేరినవై, శైలానాం= పర్వతములకు, శేఖరత్వం తన్వతే= శిరోభూషణములగుచున్నవో, తే= అట్టి, ఖే=ఆకసమునందు, ప్రేంఖంతః =చరించుచున్న, ఖచితదినముఖాః= ఉదయకాలమును వ్యక్తపరచుచున్న, ఖరాంశోః, మయూఖాః= సూర్యుని కిరణములు, వః =మీకు, సుఖం =సుఖమును , దిశన్తు= ఇచ్చుగాక.
భావము (నాకు తెలిసి)
ఏ కిరణములైతే తమ యెరుపుతో సూర్యరథసారథి అనూరుని ఎఱ్ఱదనమును విస్తరింపజేస్తున్నాయో, యేవైతే ఆ రథపు అశ్వముల ముఖాలకు కళ్ళెము రాచుకొన్న యెఱుపును దలపిస్తున్నాయో, ఏవైతే శిఖరాగ్రాలకు కిరీటములౌతున్నాయో ఆ ఆకాశము నిండిన ఆ కిరణాలు మీకు సుఖమునిచ్చునుగాక.
౯.దత్తానన్దాః ప్రజానాం సముచితసమయాకృష్టసృష్టైః పయోభిః
పూర్వాహ్ణై విప్రకీర్ణా దిశిదిశి విరమత్యహ్ని సంహారభాజః
దీప్తాంశో ర్దీర్ఘ దుఃఖప్రభవభవభయో దన్వదుత్తారనావో
గావః పావనానాం పరమపరిమితాంప్రీతిముత్పాదయన్తు||
అర్థము
సముచితసమయా కృష్ణసృష్టైః= తగిన సమయమందు ఆకర్షించుచూ మరియు విడువబడిన, పయోభిః=నీటిచేతను, (పాలచేతను), ప్రజానాం=ప్రజలకు, దత్తానన్దాః= ఆనందము నిచ్చునవియును, పూర్వాహ్ణే = పగటి మొదటిభాగమందు, దిశిదిశి=దిక్కుదిక్కులకు, విప్రకీర్ణాః=వ్యాపించినవియును, అహ్ని విరమతి=ప్రొద్దు గ్రుంకుచుండగా, సంహారభాజః= ఉపసంహారము పొందినవియును, (మరలినవియును), దెర్ఘదుఃఖ ప్రభవ భవభయోదన్వదుత్తారనావః = చిరకాలము, దుఃఖములకు కారణమయిన సంసారపు భయమనెడి సముద్రమును తరించుటకు నావలయినటువంటియును, పరం పావనానాం పావనములలోమిక్కిలి పావనములునయిన, దీప్తాంశోః= సూర్యునియొక్క , గావః కిరణములు, (గోవులు), వః=మీకు, అపరిమితాం= పరిమితిలేని, ప్రీతిం =సంతోషమును, ఉత్పాదయన్తు = కలుగజేయు గాక.
వివరణము :_ గోశబ్దమునకు గోవులనియు, కిరణములనియును రెండర్థములు. గోవులు సమయమున నీటిని ఆకర్షించి పాలిచ్చును. కిరణములు నీటినాకర్షించి వర్షమిచ్చును.గోవులు ఉదయమున మేతకు దిక్కుదిక్కులు పోయి అస్తమయ సమయమున మరలును.గోదానము చేత సంసారదుఃఖమునుగోవులు పోగొట్టును.అనగా వైతరిణిని దాటించును.కిరణములు ఉపాసనముచేత  సద్గతులు కలుగును.
భావము (నాకు తెలిసి)
గోవులు కుడితి నీళ్ళు తాగి పాలను ఇచ్చినట్లు, కిరణములు నీటిని తీసుకొని, (ఎండి పోనిచ్చి) పిదప వర్షముగానిచ్చును.పావనములైన కిరణముల ఉపాసన మీకు సద్గతులు కలిగించును.
౧౦.బన్ధధ్వంసైక హేతుం శిరసి నతి రసాబద్ధ సన్ధ్యాఞ్జలీనాం
లోకానాం యే ప్రబోధం విదధతి విపులాంభోజఖణ్డాశయేవ
యుష్మాకం తే స్వచిత్తప్రథిత పృథుతర ప్రార్థనా కల్పవృక్షాః
కల్పన్తాం నిర్వికల్పం దినకరకిరణాఃకేతవః కల్మషస్య||
అర్థము
యే= ఏవి, శిరసి నతి రసాబద్ధ సన్ధ్యాఞ్జలీనాం =సంధ్యావందనములయందు, శిరములయందు అంజలి ఘటించిన, లోకానాం= లోకులకు( జనులకు), బన్ధధ్వంసైక హేతుమ్= సంసార బంధము తొలగించుటకు హేతువైన , ప్రబోధమును, విపులామ్బోజ షణ్డాశయా ఇవ= విస్తారమైన పద్మముల యందాశ చేతనో అనునట్లు, విదధతి= చేయుచున్నచో, తే = అట్టి, స్వచిత్త ప్రథమ పృథుతర ప్రార్థనా కల్పవృక్షాః=తమ చిత్తములయందు విస్తారముగా కలిగిన కోరికలకు కల్పవృక్షములైన, దినకరకిరణా= సూర్యకిరణములు, యుష్మాకం = మీయొక్క,కల్మషస్య= పాపమునకు, కేతవః= ధూమకేతువులై (నశింపజేయునవియై) కల్పన్తాం= సమర్థులగుగాక.
భావము (నాకు తెలిసి)
అంజలి ఘటించి సంధ్యావందనము జేయు జనులకు బంధమోచనము జేయు బోధ ను జేయు కిరణములుమీపాపములను నశింపజేయుగాక.

శతకములోని అన్ని పద్యాలనూ నెమ్మదిగా ఇక్కడే వ్రాసిపెడతాను.