Loading...

3, మార్చి 2013, ఆదివారం

మయూరుని సూర్యశతకం, అర్థము -౩

౨౧.యత్కాఙ్తిం పఙ్కజానాం న హరతి కురుతే ప్రత్యుతాధిక్యరమ్యాం
నో ధత్తేతారకాభాం తిరయతి నితరామాశు యన్నిత్యమేవ
కర్తుం నాలం నిమేషం దివసమపి పరం యత్తదేకం త్రిలోక్యా
శ్చక్షుస్సామాన్య చక్షుర్విసదృశమఘభిద్భాస్వ తస్స్తాన్మహోవః||
అవతారిక
సూర్యుడు "కర్మసాక్షి జగచ్చక్షుః" అని త్రిలోకములకు నేత్రముగాక చెప్పబడినాడు. కాని సామాన్య జనుల నేత్రమునకును సూర్యతేజ మనెడి త్రిలోకనేత్రమునకును పరస్పర విరుద్ధ ధర్మములను కవి నిరూపించుచున్నాడు.
అర్థము
యత్=ఏది (ఏ సూర్యతేజస్సు) , పంకజానాం= పద్మముల యొక్క, కాంతిం=కాంతిని, న హరతి=హరింపదు, ప్రత్యుత= మీదు మిక్కిలి, ఆధిక్యరమ్యాం=(ఆ కాంతిని) యెక్కువ రమ్యమయిన దానినిగా, కురుతే= చేయుచున్నదో (సూర్యకాంతి పద్మమును వికసింపజేసి దానికి అధిక శోభను గూర్చుచున్నది . మామూలు నేత్రమునకు ఉపమానము చెప్పుట యందు కవులు "నేత్రము పద్మకాంతిని హరించు"నని చెప్పుదురు.) , యచ్చ= మరియు నే సూర్యకాంతి , నిత్యమేవ = ప్రతిదినమును తప్పక, ఆశు= (తానుదయించిన వెంటనే) శీఘ్రముగా, తారాకాభాం= నక్షత్రకాంతిని, నోధత్తే= ధరించుటలేదు, నితరాం= మిక్కిలి, తిరయతి= అంతర్ధానము చేయుచున్నది(నేత్ర మట్లు కాదు, తారకా అనగా కనుగ్రుడ్డు అని కూడా అర్థము, తారకాభాం= కనుగ్రుడ్డు యొక్క కాంతిని ధరించి యుండును) మరియు, యత్= ఏ సూర్యతేజస్సు, దివసమపి = పగలమంతయు , నిమేషం= మూసికొనుటయును, కర్తుం= చేయుటకు, నాలం= చేతకానిదో(నిమేషమనగా రెప్పపాటొక అర్థము, కన్ను పగలంతయు రెప్ప మూతలు చేయుచునే యుండును) తత్= ఆ, ఏకం=ఒక్కటియే అగు (కనులు రెండు సూర్యతేజస్సు ఒకటే) , సామాన్యచక్షుర్విసదృశం= సామాన్య నేత్రముతో పోలికలేని, త్రిలోక్యాః చక్షుః= ముల్లోకములకు నేత్రమయిన, భాస్వతఃమహః=సూర్యుని యొక్క తేజస్సు, వః= మీ యొక్క , అఘభిత్= పాపములను భేదించునది, స్తాత్= అగుగాక.
భావము (నాకు తెలిసి)
సూర్యుని వర్ణించుటయందు జగచ్చక్షుః అని అందురు. జగత్తుకు నేత్రము వంటిదని . కానీ సామాన్య చక్షువు నకు ఈ జగచ్చక్షువునకు  భేదమెంతేని కలదు. కన్నులు కమలముల కాంతిని హరించినట్టు కవులు చెప్పుదురు, కానీ జగచ్చక్షువైన సూర్యుడు కమలములకు అధికమగు కాంతిని ప్రసాదించును. మరియు తాను వెలిగినపుడు తారకల కాంతి ని గ్రహించడు సరికదా, తారకలనే అంతర్ధానము చేయును. కాని కన్నులు కనుగ్రుడ్డులనబడే తారకల కాంతి పైనే తాము ఆధారపడి యుండును. అంతియేకాక రెప్పలల్లార్చకుండా కన్నులు ఉండలేవు. జగచ్చక్షువు పగలంతయు మూతబడకయుండును.అట్టి జగచ్చక్షువైన సూర్యుడు మీకు మేలు చేయుగాక.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
౨౨.క్ష్మాం క్షేపీయః క్షపామ్భశ్శిశిరతరజల స్పర్శతర్షాద్రుతేవ
ద్రాగాశా నేతు మాశా ద్విరదకరసరః పుష్కరాణీవబోధమ్
ప్రాతః ప్రోల్లఙ్ఘ్యవిష్ణోః పదమపి ఘృణయేవాతి వేగాద్దవీయ
స్యుద్దామం ద్యోతమానా దహతు దినపతేర్దుర్నిమిత్తం ద్యుతిర్వః||
అర్థము
క్షపాంభశ్శిశిరతరజలస్పర్శతర్షాత్ ఇవ= (రాత్రి) మంచునీటిచేత బాగా చల్లనైన నీటిని స్పృశించుటకు కోరికవలనో యనునట్లు ,క్ష్మాం= భూమిని,క్షేపీ = శీఘ్రముగా, యఋతా=పొందినదియును , మరియు ఆశాద్విరదకరనరఃపుష్కరాణి= దిగ్గజములయొక్క తుండముల చివళ్ళను లేక పద్మములను (పుష్కరశబ్దమునకు తుండపు అగ్రభాగము, పద్మము రెండర్థములు. ఈ రెండింటిలో నేది అయినను గ్రహింపవచ్చును.), ప్రబోధం నేతుం ఇవ= (ఆ పుష్కరములను వికసింపజేయుటతో అనునట్లు, ఆశాః =దిక్కులను, ద్రాక్= శీఘ్రముగా, ఋతా= వ్యాపించినదియును (శ్లోకము యొక్క మొదటిపాదములోనున్న దానిని అన్వయముకై తెచ్చుకొనవలెను.) , ప్రాతః= తెల్లవారుజామును, ప్రోల్లంఘ్య=దాటి, విష్ణోఃపదం ఇతి= విష్ణువు యొక్క పదమిది అని, కృపయా ఇవ= దయచేతనో అనునట్లు, అతివేగాత్= మిక్కిలి వేగముగా (విష్ణుపదమును దాటి) , దవీయసీ= దూరమయినదియునగు, ఉద్దామం ద్యోతమానా= మిక్కిలి ప్రకాశించుచున్న, దినపతేః ద్యుతి= సూర్యుని తేజస్సు, వః= మీయొక్క, దుర్నిమిత్తం= దుశ్శకునమును,దహతు= దహించుగాక.
భావము (నాకు తెలిసి)
రాత్రంతా కురిసిన మంచువల్ల చల్లబడిని నీటిని తాకుటకు, పద్మములను, దిగ్గజముల తొండపు  చివరిభాగములను వికసింపజేయుటకు అత్యంత దూరములోనున్న విష్ణుపదమును దాటి వచ్చి గొప్పగా ప్రకాశించే సూర్యతేజస్సు మీ దుశ్శకునముల దహించుగాక.
#############################################################
౨౩.నో కల్పాపాయ వాయోరదయరయదళత్క్ష్మాధరస్యాపి గమ్యా
గాఢోద్గీర్ణొజ్వల శ్రీరహని న రహితా నో తమః కజ్జలేన
ప్రాప్తోత్పత్తిః పతఞ్గాన్న పునరుపగతా మోషముష్ణత్విషోవో
వర్తిస్సైవాన్యరూపా సుఖయతు నిఖిలద్వీపదీపస్య దీప్తిః||
అవతారిక
ఈ శ్లోకమున కవి సూర్యదీప్తిని దీపపువత్తిగా, సూర్యుని దీపముగా వర్ణించుచున్నాడు. ఇందు వర్ణ్యము వత్తి. మరియు మామూలు దీపపు వత్తికిని, సూర్యదీప్తి అనెడు వత్తికిని కల భేదమును నిరూపించుచున్నాడు.

అదయరయదళత్ క్ష్మాధరస్య= కఠినమగు వేగముచేత కొండలను పగులగొట్టిన, కల్పాపాయ వాయోరపి= ప్రళయకాలపు గాలికైనను, న గమ్యా= పోగొట్టుటకు సాధ్యము కానిదియు (సాధారణమగు దీపపువత్తి గాలికి పోవును. ఇది యట్లు కాదు.) మరియు అహని= పగటియందు, గాఢోద్గీర్ణోజ్జ్వలశ్రీ= గాఢముగా ఉజ్జ్వలకాంతులను క్రక్కుచున్నదియు (ప్రసరింపజేయునది)  సాధారణమయిన దీపపు వత్తి పగలు వెలిగించినా కాంతులీనదు) ,తమఃకజ్జలేన= అంధకారమనెడి మసితో, ననోరహితా=శూన్యము కానిది కానిదియు (అనగా మసి లేనిది అని అర్థము. శూన్యా అని వ్యతిరేకార్థకములగు ననో లను ప్రయోగించుట చేత , లేనిది అని అయినది) (సాధారణపు దీపపు వత్తికి మసి బట్టును, దీనికి మసి బట్టదు) , పతంగాత్ = సూర్యునివలన , జ్రాప్తాత్పత్తిః= ఉత్పత్తి కలిగినది (పుట్టినది) , నపునఃమోషం ఉపగతా= నాశము పొందనిది , పతంగ శబ్దమునకు మిడుత కూడ అర్థము అందుచేతను, సాధారణ దీపవర్తి పక్షమున పై దానికి వ్యతిరేకముగా, పతంగము వలన ఆరిపోవునది అని అర్థము.) , సా= అట్టి, అన్యరూపా= మామూలు వత్తి కన్న భిన్నరూపము కల, నిఖిలద్వీపద్వీపస్య= సమస్త ద్వీపములకు ద్వీపమయిన, ఉష్ణత్విషః= సూర్యునియొక్క , దీప్తి = దీప్తి అనెడి వర్తి= వత్తి, వః = మిమ్ములను, సుఖియతు= సుఖింపజేయుగాక.
భావము (నాకు తెలిసి)
సూర్యమనెడి దీపానికి, మామూలు దీపానికి గల భేదమును చూపిస్తూ కవి ఇలా అంటున్నాడు.
కొండలనే పగులగొట్టే గాలికి కూడా చెదరనిది, పగలే కాంతులు విరజిమ్మేది(తన ముందు మరే దీపము సాటి రానంతగా), శలభాల వల్ల నశించనిది, యుగాలుగా వెలుగుతున్నా మసి బట్టనిది అయిన సూర్యబింబము మిమ్ము సుఖింపజేయుగాక.
దీపము చిన్న గాలికే ఆరుతుంది, పగలు ఏ మాత్రమూ కాంతి చూపదు, శలభాలు మీద పడిపోతే ఆరిపోతుంది, వెలిగించిన చోట మసి మిగులుస్తుంది.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

౨౪.నిశ్శేషాశావపూర ప్రవణ గురుగుణశ్లాఘనీయ స్వరూపా
పర్యాప్తిం నోదయాదౌ దినగమనమయో పప్లవేప్యున్నతైవ
అత్యంతం యానభిజ్ఞా క్షణమపి తమసా సాకమేకత్ర వస్తుం
బ్రధ్నస్యేద్ద్యా రుచిర్వో రుచిరివ రుచితస్యాప్తయే వస్తునోస్తు||
అవతారిక
కవి ఈ శ్లోకమున సూర్యకాంతిని , ఐహిక విషయములందు మానవునకు కలుగురుచికిని శబ్దముల ద్వారా  ఔపమ్యమును సాధించి రుచికన్నా సూర్యరుచికి వైలక్షణ్యమును కూడ జెప్పినాడు.
అర్థము
నిశ్శేషావశావపూరప్రవణగురుగుణశ్లాఘనీయ స్వరూపా= సమస్త దిక్కులను పూరించు గొప్పగుణము చేతను స్తుతింప దగిన స్వరూపము కలదియును, (మానవ రుచిపక్షమున ఆశా శబ్దమునకు ఆశ అనియే అర్థము. కాని సూర్యరుచి ఆశలను (దిక్కులను) అన్నిటినీ పూరించును . మానవ రుచి అన్నిటినీ పూరింపలెదు. కనుక ఇది స్తుతింపదగిన స్వరూపము కలది కాదు) సూర్యరుచి ఉదయాదౌ= ఉదయించు ఆదికాలమందు మాత్రమే, పర్యాస్తాన= బాగా వ్యాపించెడిది కాదు, దినగమసమయోపప్లవేపి= పగలు పోయి అస్తమించెడి ఆపత్కాలమునందు కూడ, ఉన్నతైవ= ఉన్నతమైనదే  (సూర్యకాంతి ఉదయకాలమందు అస్తమయకాలమందు కూడ ఉన్నతముగా పైకే ప్రసరించును., మరి మానవుల రుచి సంకల్పారంభసమయంలో ఎత్తుగా నుండి అది తీరని ఆపత్కాలమున వంగి పోవును.మరియు యా= ఏ సూర్యకాంతి , క్షణమపి= క్షణకాలము కూడ, తమసా సాకం= అంధకారముతో కూడ , ఏకత్ర= ఒకచోట, వస్తుం= ఉండుటకు, అనభిజ్ఞా= ఎరుగనిచో(రుచి తమోగుణము వలన పుట్టును. దాని తోనే కలసి ఉండును.) తమస్సుతో చేరని -సా= ఆ, బ్రధ్నస్య ఇద్ధా రుచిః= సూర్యుని యొక్క ప్రదీప్తమగు కాంతి, రుచిరివ= మానవునిఅభిలాషము వలెనే, వః= మీ యొక్క(మీరు) రుచితస్య వస్తునః = కోరిన వస్తువు యొక్క, ఆప్తయే= పొందుటకొరకు , అస్తు= అగుగాక.
భావము(నాకు తెలిసి)
సూర్యరుచి అన్ని దిక్కులనూ పూరించును.ఉదయాస్తమయాలందు ఊర్ధ్వతను పాటించును. మానవ రుచి కొన్నిటినే పూరించుకోగలదు. అనగా మానవ సంకల్పబలం ప్రారంభంలో ఉన్న ఉన్నతంగా చివరిలో ఉండకపోవచ్చును. అనుకున్న లక్ష్యాలను చేరవచ్చును, చేరకపోవచ్చును. కానీ సూర్యరుచి/ప్రకాశం ఉదయం నుంచి అస్తమయం వరకూ మార్పురాకుండా వెలుగుతుంది.అది ఉన్నచోట అంధకారానికి తావులేదు. అనుకున్న లక్ష్యాలను/గమ్యాలను చేరడానికి  తోడ్పడడం మానదు. కాబట్టి మీకు అది కోరిన వస్తువులను లభించేట్టు చేయును.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
౨౫. బిభ్రాణశ్శక్తిమాశు ప్రశమిత బలవత్తార కౌర్జిత్యగుర్వీం
కుర్వాణో లీలయాధశ్శిఖినమపి లనచ్చన్ద్రకాన్తావభాసం
అదధ్వాదన్ధకారే రతిమతి శయినీ మావహన్వీక్షణానాం
బాలో లక్ష్మీ మపారామపర యివ గుహో హర్పతేరాతపోవః ||
అవతారిక
కవి ఈ శ్లోకమున సూర్యాతపమును కుమారస్వామితో పోల్చుచున్నాడు.
అర్థము
ప్రశమిత బలవత్తార తార్జిత్వగుర్వీం= బలవంతుడగు తారకాసురుని తేజస్సునణచుట యందు గొప్పదైన, శక్తిం= శక్తి అనెడు ఆయుధమును, బిభ్రాణః= భరించినవాడును (సూర్యాతపపక్షమున తారకల (నక్షత్రముల) కాంతి నణచుటయందు గొప్పదగు శక్తిని భరించునది.) , లసచ్చంద్రకాంతావభాసం= మెరయుచున్న పింఛములకొసలలో ప్రకాశించుచున్న, శిఖినమపి= నెమలిని, లీలయా= విలాసముతో , అధః కుర్వాణః= క్రిందుగా చేయుచున్నవాడును, వాహనముగా గలవాడని అర్థము. (సూర్యాతప పక్షమున చంద్రకాంతమణి వలె ప్రకాశించు శిఖిని (అగ్నిని) అధఃకరించునది, అంధకారేః= శివునియొక్క, వీక్షణానాం= కనులకు, అతిశయినీం రతిం= ఎక్కువ ఇష్టమును, అవహన్= కలిగించువాడును, సూర్యాతప పక్షమున అంధకారమునందు ఎక్కువ ఇష్టమును కలిగించునదియు, బాలః= బాలుడగు, సూర్యాతపపక్షమున లేతది, అపర ఇవ గుహః = రెండవకుమారస్వామి వలెనున్న, అహర్పతేః ఆతపః= సూర్యుని వేడిమి, వః= మీకు, ఆశు= శీఘ్రముగా, అపారం= అంతులేని లక్ష్మీం= సంపదను, ఆదధ్యాత్= కలిగించుగాక.
భావము (నాకు తెలిసి)
తారకాసురుని వధించిన కుమారస్వామి వలె తారకల కాంతిని ధిక్కరించినట్లుగా,నెమలిని వాహనం గా చేసుకున్న కుమారస్వామి వలె అగ్ని(శిఖి అంటే నెమలి, అగ్ని) కాంతినే తక్కువగా చూపించకలిగినట్లుగా, ప్రకాశించు  సూర్యకాంతి మీకు సంపదలొసగుగాక. ఇక్కడ శిఖి, తారక అనే పదాలకున్న భిన్న అర్థాల వలన ఒకే శబ్దం లో శ్లేషనుపయోగించి కవి రెండు భిన్న సందర్భాలను చమత్కారంగా వివరిస్తున్నాడు.
********************************************************
౨౬.జ్యోత్స్నాం శాకర్ష పాణ్డుద్యుతి తిమిర మషీశేషకల్మాషమీష
జ్జృమ్భోద్భూతేన పిఙ్గం సరసిజరజసా సన్ధ్యయా శోణశోచిః
ప్రాతః ప్రారమ్భకాలే సకలమపి జగచ్చిత్రమున్మీలయన్తీ
కాన్తిస్తీక్ష్ణత్విషోఽక్ష్ణాం ముదముపనయతాత్తూలికేవాతులాం వః ||
అవతారిక
కవి ఈ శ్లోకమునందు సూర్యకాంతిని పలురంగులతో చిత్రమును లిఖించి ప్రకాశింపజేయు చిత్రకారుని కుంచెతో పోల్చుచున్నాడు.
అర్థము
జ్యోత్స్నాం శాకర్ష పాండుద్యుతి తిమిర మషీశేషకల్మాషం =(ప్రాతఃకాలమున) కొద్ది వెన్నెల మిగులుటచే కొద్ది తెలుపును, కొద్ది చీకటి మిగులుటచే కొద్ది నలుపును కలిసి చిత్రవర్ణము కలిగిన మరియు , ఈషజ్జృంభోద్భూతేన = కొంచెము వికసించుటచేత కలిగిన, సరసిజరజసాం= పద్మముల పుప్పొడిచేత, పిఙ్గం= పచ్చగా నున్న మరియు, సంధ్యయా= సంధ్యాకాలముచేత (రాత్రికి పగలుకు సంధికాలము) , శోణరోచిః = ఎరుపు రంగుగల,జగత్= జగత్తును, సకలము= సమస్తమును, ప్రాతః ప్రారంభకాలే = సూర్యోదయపు మొదటి సమయమున , చిత్రమివ= చిత్రపటమును వలెనే, ఉన్మీలయన్తీ= తెరచుచున్న, తీక్ష్ణత్విషః= సూర్యుని యొక్క, కాంతిః= కాంతి , తూలికేవ= (చిత్రకారుని కుంచె వలె) , వః= మీ యొక్క , అక్ష్ణాం= కన్నులకు, ముదం= సంతోషమును, ఉపనయతాత్= కలిగించుగాక.
భావము (నాకుతెలిసి)
చిత్రకారుడు రంగులన్నీ వాడి అద్భుతమైన చిత్రము చిత్రించినట్టుగా సూర్యభగవానుడు రాత్రి కొద్దిగా మిగిలిన వెన్నెల తెలుపునీ, చీకటి నలుపునీ, సంధ్య ఎరుపునీ, కొద్దిగా వికసించిన పద్మపు పుప్పొడి పసుపునీ వాడి ఉదయకాలమును కన్నులకు సంతోషం కలిగించే విధముగా చిత్రించుచున్నాడు.
((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((
౨౭. ఆ యాన్తీం కిం సుమేరోస్సరణిరరుణితాపాద్మరాగైః పరాగై
రాహోస్విత్వ్సస్యమాహారజన విరచితావైజయన్తీ రథస్య
మాఞ్జిష్ఠీ ప్రష్ఠవాహావళి విధుత శిరశ్చామరాళీను లోకై
రాశఙ్క్యాలోకితైవంసవితురఘనుదేస్తాత్ప్రభాత ప్రభా వః ||
అర్థము
పాద్మరాగైః = పద్మరాగమణుల సంబంధమగు, పరాగైః= పొడులచేత, అరుణితా= యెర్రగా చేయబడినదై, సుమేరోః= మేరు పర్వతమునుండి, ఆయాన్తి= వచ్చుచున్న , సరణిః కిం=  మార్గమా ఏమి? (అనియును), మాహారజనవిరచితా= కుంకుమపువ్వులచేత చేయబడిన (ఎర్రరంగు పూయబడిన) స్వస్యరరస్యవైజయన్తీ అహోస్విత్= తన రథముయొక్క పతాకమా యేమి (అనియును) , మాంజిష్ఠ ప్రష్ఠ వాహావళి విధుతశిరశ్చామరాళీను= పచ్చని తన  మేలిగుఱ్ఱములు తలలు విదిలింపగా ఆ తలలపైనున్న చామరములా? అనియును, ఏవం= ఈ ప్రకారముగా , లోకైః= లోకులచేత , ఆశంక్య ఆలోకితా= ఊహించి చూడబడిన, సవితుః = ప్రభాత ప్రభా= సూర్యుని ఉదయంకాంతి, వః = మీకు, అఘనుదే= పాపములు పోగొట్టుటకు, స్తాత్ = అగుగాక.
భావము (నాకు తెలిసి)
సూర్యుడు ఉదయిస్తుండగా వచ్చిన యెరుపు కాంతి మేరు పర్వతము పైనుండి పద్మరాగమణుల పుప్పొడితో వేయబడిన మార్గమా అన్నట్లు, కుంకుమపువ్వులచేత చేయబడిన తన రథము యొక్క పతాకమా అన్నట్లు తన గుఱ్ఱములు తలలు విదిలింపగా రాలి పడిన చామరములా అని విభ్రాంతి తో ఊహాగానము చేయు మీకు ఆ ఉదయకాంతి పాపములు పోగొట్టుగాక.
))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))
౨౮.ధ్వాన్తం ధ్వంసం విధత్తే నతపతి రుచిమన్నాతిరూపం వ్యనక్తి
న్యక్తం నీత్వాపి నక్తం న వితరతి తరాంతావదహ్నస్త్విషం యః
సప్రాతర్మావిరంసీదసకల పటిమా పూరయన్యుష్మదాశా
మాశాకాశావకాశా వతరణతరుణ ప్రక్రమోఽర్క ప్రకాశాః ||
అర్థము
యేః= ఏది, రుచిమాన్=కాంతి కలదయి, (తీక్ష్ణత్వము కలదియై) , ధ్వాంతధ్వంసం విధత్తే= చీకటి ని రూపుమాపుచున్నది, నాతిరూపం వ్యనక్తి = తనరూపమునెక్కువ వ్యక్తపరచుట లేదు , నక్తం న్యక్త్వం నీత్వాపి= రాత్రిని తక్కువ చేసియును, తావత్= అప్పుడు, అహ్నఃత్విషం = పగటికాంతిని, నవితరతితరాం= యెక్కువగా నియ్యదో (అట్టి ) ప్రాతః= ఉదయమున , అసకలపటిమా= అసమగ్రమగు సామర్థ్యము గల, ఆశాకాశావతరణతరుణ ప్రక్రమః= దిక్కుల ఆకాశమునకు దిగుచున్న (వ్యాపించుచున్న) మరియు లేతనైన , సః= ఆ, అర్కప్రకాశః సూర్యకాంతి , యుష్మదాశాం = మీ కోరికను, పూరయన్= పూరించుచున్నదై, మా విరంసీత్ = విరామము లేక కొనసాగుగాక.
భావము (నాకు తెలిసి)
ఏ లేత సూర్యప్రకామైతే తీక్ష్ణమగు కాంతితో చీకటిని రూపుమాపుచున్నదో, తన రూపము అవ్యక్తముగా నుంచుతూ రాత్రిని తక్కువ  జేయుచూ, అన్ని దిక్కులనూ వెలిగించుచున్నదో ఆ సూర్యకాంతి మీ కోరికలను పూర్తి జేయుటలో విరామమెఱుగక నుండుగాక.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
౨౯.తీవ్రం నిర్వాణహేతుర్యదపి చ విపులం యత్ప్రకర్షేణ చాణు
ప్రత్యక్షం యత్పరోక్షం యదిహయదపరం నశ్వరం శాశ్వతంచ
యత్సర్వస్య ప్రసిద్ధం జగతి కతి పయేయోగినో యద్విదంతి
జ్యోతిస్తద్విప్రకారం సవితురవతు వో బాహ్యమాభ్యంతరంచ||
అర్థము
యదపి= యేది, తీవ్రం = వేడియయి, నిర్వాణహేతుః= సుఖ (మోక్ష) హేతువయినదో, యత్= ఏది, విపులం విస్తారమయి, ప్రకర్షేణచాణు = మిక్కిలి అణువయినదో, యత్= యేది, ప్రత్యక్షం= కనపడుచున్నదయి, పరలోక సంబంధమయినదో , నశ్వరం = నశించుస్వభావము కలదై(అస్తమించుట) శాశ్వతంచ= శాశ్వతము గూడ నయినదియో, యత్= యేది, సర్వస్య ప్రసిద్ధం= అందరికిని తెలిసినదో,యత్=దేనిని , జగతి= లోకమున కతిపయే యోగినః= కొందరు యోగులు మాత్రమే, విదంతి= తెలుసుకొనుచున్నారో, తత్= అటువంటి, ద్విః ప్రకారః= రెండు రీతులు కలిసినదై, బాహ్యం అభ్యంతరం చ= వెలుపల, లోపల ప్రకాశించుచున్న, సవితుఃజ్యోతిః =సూర్యుని యొక్క తేజస్సు, వః = మిమ్ము, అవతు= రక్షించుగాక.
భావము (నాకు తెలిసి)
ఏ సూర్యుని యొక్క తేజస్సు వేడిగా ఉంటూ సుఖం కలిగిస్తుందో, విస్తారంగా ఉంటూ కూడా అణుమాత్రమయినదో,  పరలోక సంబంధమయినదయి కూడా చర్మచక్షువులకు కనిపిస్తూ ఉన్నదో, అస్తమించే గుణం ఉండి కూడా శాశ్వతమయినదో, అందరికీ కనిపిస్తూ కూడా కొందరికే అవగతమయ్యే లక్షణం కలిగినదో అట్టి తేజస్సు మిమ్ము రక్షించుగాక.
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
 ౩౦. రత్నానాం మణ్డనాయప్రభవతి నియతోద్దేశ లబ్ధావకాశం
వహ్నైర్దార్వాది దగ్ధుం నిజజడిమతయాకర్తు మానన్దమిన్దోః
యచ్చత్త్రై లోక్య భూషావిధిరఘుదహనంహ్లాది వృష్ట్యాశుతద్వో
బాహుళ్యోత్వాద్యకార్యాధికతరమివతాదేక మేవార్కతేజః||
అవతారిక
రత్నములకు, అగ్నికి, చంద్రునకును తేజస్సుకలదు. కానీ ఆ కాంతి వరుసగా నొక్కొక్కటి దేహాలంకారానికి, కర్రను కాల్చుటకు, ఆనందము కలిగించుటకు మాత్రమే. కానీ సూర్యతేజస్సు ఒక్కటే అన్ని విధములుగానుపయోగించునని కవి భావము. ఈ శ్లోకమున తేజశ్శబ్దాన్ని "ప్రభవతి" అను దానిని రత్న, వహ్ని, యిందు శబ్దములకు కూడ అన్వయింపజేయవలెను.
అర్థము
నియతోద్దేశ లబ్ధావకాశం= పరిమితములగు (కర్ణాది) ప్రదేశములయందున్న, రత్నానాంతేజః= రత్నములతేజస్సు, మండనాయ= అలంకారము కొరకు, ప్రభవతి=పనికివచ్చుచున్నది,వహ్నేః= అగ్నియొక్క (కాంతి) దార్వాది= కఱ్ఱ మొదలగు వాటిని, దగ్ధుం= కాల్చుటకు(పనికి వచ్చుచున్నది) , యత్తు= యేది, త్రైలోక్య భూషావిధిః= మూడు లోకములకు అలంకారవిధి అయినదో, అఘదహనం= పాపములను దహించునదో, వృష్ట్యా = వర్షము చేత (కురిసి) హ్లాది = సంతోషము కలుగజేయునదో, తత్= అట్టి, బాహుళ్యోత్పాద్యకార్యాధికతరం= బహుకార్యములను (రత్నకార్యము, వహ్ని కార్యము, చంద్రకార్యము) ఉత్పాదించుట చేత, మిక్కిలి అధికమయిన, అర్కతేజః= సూర్యతేజము, ఏకమేవ=ఒక్కటే వః= మిమ్ము, అవతాత్= రక్షించుగాక "ఆదిత్యాజ్జాయతే వృష్టిః" సూర్యుని వలన వర్షము కురియునని శాస్త్రము.
భావము (నాకు తెలిసి)
రత్నములు, అగ్ని, చంద్రుడు వరుసగా అలంకారమునకు, కర్రను కాల్చుటకు, మానసికాహ్లాదము కలిగించుటకు విడివిడిగా ఉపయోగపడును. సూర్యుడు మూడు లోకాలకు అలంకారమై, సర్వ పాపములను దహిస్తూ, మానసికాహ్లాదము కలిగిస్తూ, వర్షము నకు కారణమగుచున్నది.  కాబట్టి పై మూడింటి సుగుణాలనూ తనలోనే కలిగి ఉన్నట్టి సూర్యకాంతి మిమ్ముల రక్షించుగాక.