Loading...

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

మృత్తికతోడ

 

ఉత్పలమాలలు, చంపకమాలలు -
 
మృత్తికతోడరూపుఁగొని మెల్లగ నిండ్లనుఁగొల్వుదీరి యా
యత్తముఁజేసినట్టి జనులందరు వృద్ధినిఁ బొంది చెల్గగాఁ
జిత్తము నిండు దీవనల సేమము యోగముఁజూచు కొం
గ్రొత్త వినాయకాధిపునిఁ గోరి భజించుట పర్వమియ్యిలన్.
 
ఆదరమొప్పగా మెలగి యమ్మకునయ్యకుఁ దోషమిచ్చు నీ
మాదిరి సంతులెల్లరును మన్నన నేర్వగ దారిచూపుదో
మోదకభక్షకా! పదము మున్నడి నుండగఁ దద్విధిన్ సదా
నీ దయ నుంచుమయ్య, పరనిందలఁ బాల్వడకుండఁగావుమా!
 
చపలుల మేము నిద్ధరను సంకటమందున నిన్నుఁదల్చి యా
యుపరిని భోగజాలముల నుద్ధృతులందున మానివైతుమీ
జపమును నిందఁజేయుదుము సైపగఁజాలక నీతిబాధలం,
గపటులఁగాముఁ గావు మము గౌరి సుతుండవెఱుంగజాలవో!
 
దూర్వనొసంగగాఁ గొనుచు, దుఃఖములెల్లనుఁ దీర్చువాడు, నే
గర్వములేక యెల్లరకు గండములన్నిటిఁ ద్రోయువాడు, నే
పర్వమునందునైనఁ దొలి పంక్తినిఁ బూజలనందువాడు, నీ
యుర్విని నన్నిదిక్కులను నున్కినిఁగల్గిన దేవుడీతడే!
 
పలకనుఁ జేతఁబూని తొలి పాఠము నేర్చిననాటినుండియుం
దొలుతగ నొజ్జ నీవనుచు దూర్వనివేదనమిచ్చి ప్రార్థనం
బలుకుటె నేర్పె తల్లి, పలు భావనలెట్టులఁ జుట్టుముట్టినన్
సులువుగ నల్లగల్గు పరి చొక్కపు నేర్పునొసంగు దేవరా! 
 
-లక్ష్మీదేవి.
#నాపద్యాలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి