Loading...

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

మృత్తికతోడ

 

ఉత్పలమాలలు, చంపకమాలలు -
 
మృత్తికతోడరూపుఁగొని మెల్లగ నిండ్లనుఁగొల్వుదీరి యా
యత్తముఁజేసినట్టి జనులందరు వృద్ధినిఁ బొంది చెల్గగాఁ
జిత్తము నిండు దీవనల సేమము యోగముఁజూచు కొం
గ్రొత్త వినాయకాధిపునిఁ గోరి భజించుట పర్వమియ్యిలన్.
 
ఆదరమొప్పగా మెలగి యమ్మకునయ్యకుఁ దోషమిచ్చు నీ
మాదిరి సంతులెల్లరును మన్నన నేర్వగ దారిచూపుదో
మోదకభక్షకా! పదము మున్నడి నుండగఁ దద్విధిన్ సదా
నీ దయ నుంచుమయ్య, పరనిందలఁ బాల్వడకుండఁగావుమా!
 
చపలుల మేము నిద్ధరను సంకటమందున నిన్నుఁదల్చి యా
యుపరిని భోగజాలముల నుద్ధృతులందున మానివైతుమీ
జపమును నిందఁజేయుదుము సైపగఁజాలక నీతిబాధలం,
గపటులఁగాముఁ గావు మము గౌరి సుతుండవెఱుంగజాలవో!
 
దూర్వనొసంగగాఁ గొనుచు, దుఃఖములెల్లనుఁ దీర్చువాడు, నే
గర్వములేక యెల్లరకు గండములన్నిటిఁ ద్రోయువాడు, నే
పర్వమునందునైనఁ దొలి పంక్తినిఁ బూజలనందువాడు, నీ
యుర్విని నన్నిదిక్కులను నున్కినిఁగల్గిన దేవుడీతడే!
 
పలకనుఁ జేతఁబూని తొలి పాఠము నేర్చిననాటినుండియుం
దొలుతగ నొజ్జ నీవనుచు దూర్వనివేదనమిచ్చి ప్రార్థనం
బలుకుటె నేర్పె తల్లి, పలు భావనలెట్టులఁ జుట్టుముట్టినన్
సులువుగ నల్లగల్గు పరి చొక్కపు నేర్పునొసంగు దేవరా! 
 
-లక్ష్మీదేవి.
#నాపద్యాలు

same

 

పూలతో భక్తిగాఁ బూజించి, ప్రణమిల్లి,
స్తుతులను నతులను సుందరముగఁ
బలికియుఁ గొలిచియుఁ బాడియు వేడియు
పూజ ముగిసినంత ముగియునెల్ల
నార్భటమ్ముల జోరు, నంత్యకాలమునందు
దేహగతియునట్లె తేలిపోవు;
పాలువెన్నలు, పండ్ల నాలనఁ బాలన
కామితార్థములెల్ల కానుకలుగ
ముద్దుమురిపెమన్న ముచ్చటలందున
మెరుగులున్న మేలి మేనులైన
గడువు ముగిసినంత కమిలి కరిగి యంత-
రించిపోయి, కడకు రిక్తమగును.
--లక్ష్మీదేవి.
సీసము, ఆటవెలది.

నగధరునకు నగధరునకు..

 

సర్వలఘుఛందోగతులు ఆకర్షిస్తాయి. 
 
నగధరునకు నగధరునకు
మృగముఖునకు నలువసతికి మెలకువ మతినై
ఖగవినుతుని సతికిని నా
నగసుతకును ప్రియసుతనయి నతులఁ బలికెదన్. 
 
--లక్ష్మీదేవి.
కందము.

పారిజాతాలు 😊

 May be an image of one or more people and henna

చూపే ..

 

చూపే శ్రావణమేఘమై కురిసెనీ శుద్ధాత్మలోనార్ద్రమై
తాపాక్రందన శోకముల్దొలగగా ధన్యాత్మనుంజేయగాఁ
గోపానంతరరాగమై తరళమై గూఢార్థసంసక్తమై
చాపభ్రూగతబాణమైఁ జొనుచు నాశ్వాసమ్ముఁ జేకూర్చుచున్.
--లక్ష్మీదేవి.
శార్దూలము

7, ఆగస్టు 2024, బుధవారం

అన్యమెఱుంగను

 అన్యమెఱుంగ, నీ పదములందు మదున్నతిఁగాంతు, నందె నా

ధన్యత నెంతు, యుక్తమగు ధారణఁ దారణయుక్తసూక్తులన్

మాన్యముఁబెంచు భావనల మన్నననిచ్చినఁ జాలునందు, సా

మాన్యను, నాదు విన్నపము మక్కువమీరగ నాలకింపుమా!


-లక్ష్మీదేవి.

ఉత్పలమాల

21, జులై 2024, ఆదివారం

జోతలు

 పలుకు, పదములందు పట్టునిచ్చినవారు,

సుఖము, శాంతి, కొరత, శోకమెల్ల

నదనుఁజూచి కూర్చి, పదనుఁదీర్చినవార

కెల్ల జోతలిడుదు నిందునెందు.


-ఆటవెలది.

లక్ష్మీదేవి.