భాసమానసమానకాంతులు వన్నెచిన్నెల వింతలై
లాసహేలలకూపిరూదిన లక్షణమ్ము నిరంతమై
వేసవిన్ పరితాపమందున వేగుచుండ, వసంతమా!బాసలేరికి చేసెదో మరి, వత్తువే భువి ముంగిటన్.
-లక్ష్మీదేవి
మత్తకోకిల
వినగల రాగమాధురులు వీనులవిందుగనాలపించి నా
యనగల తీరుతెన్నులను నందముగా పలికింపజేసి నే
కనగల స్వప్నవాటికల కావ్యరసంచిత చిత్రరూపమై
మనగలకూర్మిఁబంచితివి మర్మవినూతనమైన భంగినిన్.
-లక్ష్మీదేవి
చంపకమాల
మధురిమలొసగిన తీయని
సుధలనుఁ బాటలఁ గురియుచు శోభస్కరమై
యధరములొలికిన పలుపలు
విధముల రాగిణి స్వరములు వీనుల విందుల్.
--లక్ష్మీదేవి.
కందము
పంచచామరము యతియుక్తము
నిరంతరమ్ముగా వసంతమున్ననేమి దైవమా?
సురంజనమ్ముగా ప్రపంచమున్ననేమి నష్టమా?
నరాంతకమ్ముగా విషాణువున్న లోకమందునన్
మరింతగా కృపన్ ప్రసాదనమ్ముఁజేయుమా సదా!
పంచచామరము యతిముక్తము
--లక్ష్మీదేవి.
చిరకాలమ్ముగ నున్నభావనలు సుస్నేహంపు మాధుర్యముల్
సరిరానేదియులేనియట్టివగు నాస్వాదించుసౌహార్ద్రముల్
సిరులందొల్కెడు భవ్యమై చిలుకునా స్నిగ్ధంపు సౌందర్యముల్
నిరతమ్మిట్టులె నుండగాఁదగును పన్నీరంపు సౌగంధమై.
-లక్ష్మీదేవి.
మత్తేభవిక్రీడితము.