Loading...

23, ఏప్రిల్ 2014, బుధవారం

భారత పునర్నిర్మాణం

దేశ సమగ్రతకు, సమైక్యతకు తగినట్టుగా ఆలోచించడం, నడచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత. తమతమ జీవన పోరాటం లో వ్యస్తులైన వారు ఈ బాధ్యత కోసం ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా నష్టం లేదు గానీ పూనుకొని సమైక్యతకు భంగం కలిగించే పని చేయకూడదు. చేసినచో శిక్షార్హులు.
            కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నదేమి? జీవనపోరాటం కాక జగత్తంతటిపైనా ఆధిపత్యం సాధించాలనే తృష్ణతో స్వార్థపూరితమైన ఆలోచనలతో కనిపించిందంతా దోచుకొని తినే ప్రమాదకరమైన వ్యక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ధనదాహం , అధికారదాహం అనే రోగానికి గ్రస్తులై ఎంతకైనా తెగించి స్వంత దేశస్థులనే అధోగతి పాల్జేస్తున్నారు. పరాయి వాళ్ళ మీద కూడా తలపెట్టని, కూడని విధ్వంసమంతా స్వంత వాళ్ళమీదనే చేస్తున్నారు. విదేశీయులు మనమీద దాడి చేసినపుడు గాని, దొంగదారుల్లో అధికారపీఠాలు ఎక్కినపుడు గానీ భారతీయులు ఎంతో ధీరత్వం, శూరత్వం ప్రదర్శించి జయించినారు.
        స్వదేశీయులే మాటలగారడీతో నమ్మబలికి చిత్రవిచిత్రమన పథక రచన చేసి సర్వనాశనం చేస్తుంటే సహనం వహించినారు కొంతకాలం. ఇంకెంతకాలం సహిస్తారు? దేవుని దయవలన ఎన్నోదేశాల్లో లేని ప్రకృతివనరులు, మానవ వనరులు , అద్భుతాల్ని సృష్టించ గల మేధావులు మన దేశం లో ఉన్నా అభివృద్ధి ఏదీ?
 అసలు మన దేశం అనే భావన ఉంటే కదా ముందుకు ఆలోచనలు చేయగలిగేది?
అభివృద్ధి అంటే తెలిస్తేనే కదా అమలు చేయగలిగేది?
అభివృద్ధి అంటే రైళ్ళు, రోడ్లు, పలు అంతస్తుల మేడలు, సబ్సిడీల లంచాలు కాదు. పథకాల పేరుతో మోసాలు కాదు. అధునాతనమైన పరికరాలు కాదు.
అభివృద్ధి అంటే స్వయం సమృద్ధి.
అభివృద్ధి అంటే అందరి అన్ని అవసరాలూ తీరడం. సౌకర్యాలు కలిగించడం కాదు.
అభివృద్ధి అంటే మనదగ్గర ఉన్న దాన్ని పెంచి పోషించుకోగలగడం అంతే కానీ కొండలున్నా కరిగించి తినేయడం కాదు.
ఇంట్లో పిల్లలకు నచ్చుతాయని ఎప్పుడూ బేకరీ తిండ్లు, తీపి పదార్థాలతో కడుపు నింపుతూ, ఇరవైనాలుగు గంటలూ టీవీ ఇంటర్నెట్టు ఇతర దుర్వ్యసనాలతో పొద్దు పుచ్చనిస్తే వాడి అభివృద్ధి జరిగినట్టేనా? కాదు. వాడి శరీరం రోగభరితం అవుతుంది. వాడిమనసు క్రూరమైతుండి. వాడి తెలివి మసక బారుతుంది.
పెద్దవాడై అష్టకష్టాలూ పడతాడు.
అలాక్కాక వాడికి తగినంత వినోదము కల్పిస్తూ మంచిచెడులు బోధిస్తూ లోక జ్ఞానమూ తెలిసేలా చేస్తూ, ప్రేమను అందిస్తూ తెలివికి పదును పెడుతూ ఉంటే, పెద్దవాడై వాడు సుఖపడతాడు. నలుగురి కి ఉపయోగపడతాడు. మంచి పేరు తెచ్చిన సంతోషంతో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా నిలిచి అందరికీ ఆదర్శప్రాయుడైతాడు.
పై రెండు దారుల్లో ఏదారిలో పెంచాలన్నా పెంచేవాళ్ళకు కష్టపడవలసే వస్తుంది. కానీ ఫలితం ఏది మంచిది అని ఆలోచించాల.
మొదటిది మంచిది అనుకొనేవాళ్ళకు కొడుకు మీద ప్రేమకన్నా తమ ప్రేమ కొడుకు, ప్రపంచానికి తెలియాలన్నదే ముఖ్యంగా ఆ ప్రేమ ప్రదర్శనపు ఆరాటంలో పడి అసలు ప్రేమను ఎక్కడో విడిచి పెడతారు.
రెండవదే మంచిది అని నిర్ణయించుకోవాలంటే వాడిమీద నిజమైన ప్రేమ ఉండాల. నా స్వంత కొడుకనే భావన ఉండాల. వాడి అభివృద్ధిని మనసారా కాంక్షించాల.
ఇక్కడ ప్రేమ ప్రదర్శన ముఖ్యం కాదు. ఆప్రేమ కొడుకు విజయంలో వాడికి అన్ని విధాలా తోడ్పడాలన్నదే ముఖ్యం. అపుడు ప్రదర్శన మీద మోజు పోయి నిజమైన తోడ్పాటు ను అందించగలరు.
ఇదే దేశానికీ వర్తిస్తుంది. ఎప్పుడైతే ఈ దేశం  మనది, ఈ దేశం నాది అనుకుంటామో అప్పుడే  ఈ దేశం సమైక్యతను గురించీ, అభివృద్ధి గురించీ ఆలోచించగలము, మాట్లాడగలము.
దేశమంతా ఒక్కటే అందరు దేశవాసులు నా వాళ్ళే అనుకున్నపుడు బుజ్జగింపు ధోరణులు, మసిపూసి మారేడుకాయలు చేయడాలూ ఉండవు. దేశంలోని సహజ వనరులైన ప్రకృతి వనరులు, మానవవనరులు దుర్వినియోగం కాకుండా ఆపగలిగే సంకల్పం ఉండాల.
అంటే భూమిపైన ఉన్న భాగాన్ని, లోపల ఉన్న గనులను అక్రమంగా అమ్ముకొనే వాళ్ళను కట్టడి చేయాల. అపుడే దేశానికంతా భూమి పైభాగమూ, లోపలిభాగమూ ఉపయోగపడుతుంది. నల్లధనాన్ని కన్వర్ట్ చేయడానికి పరిశ్రమల పేరుతో భూములను అక్రమంగా కొని వృథాగా పెట్టడమూ, లేదా లోపలి వరకూ గనులు త్రవ్వి ఖనిజాలను అంటే అత్యంత విలువైన ముడిసరుకును  విదేశాలకు అమ్మడం ఆపాల.
ముడిసరుకు అమ్మకుండా భూమిపైన పరిశ్రమలు పెట్టి వాటిని ప్రాసెస్ చేయగలిగితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. తయారైన సరుకును విదేశాలకు చట్టపరంగా అమ్మితే మరింత లాభమూ, ప్రపంచ వ్యాపారరంగంలో పేరూ నిలుస్తాయి.
నీటివనరులను ఎక్కువైన చోటినుంచి తక్కువైన చోటికి కాలువలుగా పారించి, అన్ని వైపులా సస్యశ్యామలం చేయగలిగే విధానాలెన్నో శ్రీ స్వామినాథన్ వంటి వారు చెప్పినా పట్టించుకోకపోతే అభివృద్ధి ఎట్ల సాధ్యమైతుంది?
ఏ ఆనకట్టనైనా సంకల్పం వరకే అటు తర్వాత వచ్చే నిధులన్నీ మింగే వాళ్ళ నోళ్ళలోనికే పోతున్నాయి.
పెద్ద రాజకీయ నాయకులు, శ్రీమంతులు, ప్రభుత్వ భవనాలో వృథా గా పోయే విద్యుత్తుని ఆదా చేస్తే సామాన్యుడికి విద్యుత్కోత బాధలేకుండా చేయగలిగే మేధావులు మనకున్నారు. వారిమాట ఒప్పుకొనే నేతలే లేరని పుస్తకాలకు పుస్తకాలు అవినీతి కుంభకోణాల గురింఛి వ్రాసి ప్రచురిస్తున్న ప్రభుత్వ ఉన్నతోద్యోగులను చూస్తే తెలియడ లేదా?
ఈ విధంగా భూమి , నీరు , నిప్పులను అన్యాయంగా వ్యర్థం చేస్తున్న వ్యవస్థ పోవాల.
యువతరం లో ఉత్తేజం కలిగించాల. దేశభక్తి భావనను రగుల్కొల్పాల. మనదేశం బాగుపడాలని మది నిండా ఆకాంక్షించే వారే నిజమైన మార్పు తేగలరు.

మనదేశానికి ప్రధానమంత్రి కాబోతున్న శ్రీ నరేంద్రమోడీలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అతడు మాత్రమే కాక అతన్ని వెన్నంటి నడచే యువత కూడా మన దేశాన్ని అభివృద్ధి , స్వీయసమృద్ధి బాటలోకి నడిపించబోతున్నది.
భాజప ఆదర్శాలు, ఆచరణ వల్ల మొదటినుంచీ ప్రభావితురాలినైనా రాష్ట్రం విడగొట్టిన తీరులో వారి పాత్ర వలన ఆ పక్షం మీద ఆరాధన లేకపోయినా నరేంద్రమోడీ నాయకత్వం మీద నమ్మకముంది. అతడు చేసి చూపించిన అభివృద్ధి ఆశలు పెంచుతున్నది.
భారత పునర్నిర్మాణం మనందరి చేతుల్లో ఉంది. దేశభక్తుడై భారతీయులందర్నీ ఒక్కతాటిపై నడిపించగలిగే శక్తి సామర్థ్యాలున్న నరేంద్రుని చేయీ చేయీ కలిపి అనుసరించే తరుణం ఇది. దేశాన్ని సర్వతో ముఖాభి వృద్ధి చెందిన స్థితిలో నిలపాలంటే నరేంద్రమోడీ ని గెలిపించాలని మిత్రులందర్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.