Loading...

21, ఫిబ్రవరి 2009, శనివారం

పూజలేల? అర్చనలేల?

మహాదేవి వర్మ హిందీలో పేరు మోసిన గొప్ప కవయిత్రి. ఓ కవితలో పూజలో విధి విధానం కన్నా భక్తి భావన ముఖ్యమని, వస్తువులన్ని సమకూర్చామా లేదాఅని చూసేబదులు మనసు లగ్నం చేశామో లేదో చూడటం ముఖ్యమని వేదాలలో,పురాణాలలో రాసినదాన్ని కవయిత్రి చక్కటి మాటలలో చెప్పారు. అందుకే ఈ కవిత నాకు చాలా నచ్చింది.ఆవిడ రాసిన క్యా పూజన్ క్యా ఆర్చన్ రే! అనే కవితని నాకు తెలిసిన తెలుగులో రాసుకున్నది నా బ్లాగులో పెట్టుకుంటున్నాను . ఇందులో కాపిరైట్ సమస్యలు రావని అనుకుంటున్నాను.

పూజలేల? అర్చనలేల?

మన మందిరమున వెలసిన ప్రియదేవునికి
 పూజావిధులేలా మరి ఏ అర్చనలేలా?

అనంతుడగు స్వామికి కోవెల ఈ చిరు జీవనమన
 అభివాదనలొనరించును నిత్యము నా ఊపిరులివి
పదధూళిని కడుగుటకే నా కంటను కన్నీరన
పులకలు సిరి అక్షతలయి, ఎద వేదన చందనమయి
అలరారే!
రాగ భరిత మది ప్రమిదను వెలిగింతును, నా
కనుచూపుల కలువపూలు అర్పింతును నే!
సుగంధముల నా స్పందనలే ధూపాలై
అధరాంకిత జప తాళములకు  కనురెప్పల నర్తనములు
నలరారే!
- లక్ష్మీదేవి.

స్వామి అనంతుడైనా నేను శీఘ్ర గతిని అంతమయ్యే అల్పమైన జీవనాన్ని మాత్రమే నేను చిరు కోవెలగా చేయగలనని,ప్రమిదలో నూనె కు బదులు అనురాగాన్ని నింపానని చెప్పడం ప్రతి పదమూ చాలా చక్కటి అనుభూతి తో రాశారనిపిస్తోంది.